సముద్రానికి ఉప్పు…అడవికి ఆకులు..అమ్మితే వ్యాపారం నడుస్తుందా.!? ఈ రెండిటీని కలిపి కారం పెట్టి ఊళ్లో ఊరగాయలా అమ్మితే బిజినెస్ పరుగెడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే..జనం పల్స్ పట్టుకుంటేనే పర్స్ నిండుతుంది.
ఈ లాజిక్ తెలిసిన ఓ ఫోటోగ్రాఫర్ ట్రెండీ పబ్లిసిటీ ప్లాన్ చేశాడు. సామాన్యుడికి కొనలేని టమాటాని తన స్టూడియోకి ముడి పెట్టాడు. ఒక పాస్ పోర్ట్ ఫోటో తీయించుకుంటే పావుకిలో టమాటాలు ఫ్రీ అని బోర్డ్ పెట్టాడు..అంతే ! గిర్రున గిరాకీ స్టూడియోవైపు తిరిగింది.అతని పంట పండింది.!
వివరాల్లోకి వెళితే … భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన వేముల స్థానిక కలెక్టరేట్ సమీపంలో కొంతకాలంగా ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఇటీవల కలెక్టరేట్ పాల్వంచకు మారడంతో ఆనంద్ గిరాకీ బాగా తగ్గిపోయింది.
దీంతో ఆనంద్ ఓ కొత్త ఆలోచన చేశాడుఅనుకున్నదే తడవుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు.
తన వద్ద ఫొటో తీయించుకున్నవారు రూ.100 చెల్లిస్తే పాస్‌పోర్టు సైజు ఫొటో కాపీలు 8 ఇస్తూనే ఉచితంగా పావు కిలో టమాటాలు అందిస్తానని ప్రచారం చేశాడు. బుధవారం ఫొటోలు తీయించుకున్న 32 మందికి ఒక్కొక్కరికీ రూ.40 విలువ గల పావు కిలో టమాటాలు అందించినట్టు ఆనంద్ తెలిపారు.