సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ (Congress) మభ్య పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ పద్దులపై చర్చ జరగలేదన్నారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా? హామీలు ఇచ్చి తర్వాత లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. అలవి కానీ హామీలను కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఆ పార్టీకి ఇప్పుడు అసలైన ఆట ముందు ఉందన్నారు.
ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో తాము చూస్తామన్నారు. స్పీకర్గా ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఏనాడు పద్దులపై చర్చ జరగలేదన్నారు. ప్రతి ఏడాది కాగ్ నివేదికలు ఇస్తోందన్నారు. ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నారని వెల్లడించారు.
తాము ఏటా పద్దులపై శ్వేత పత్రం కూడా విడుదల చేశామన్నారు. రుణమాఫీపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ అన్నారని తెలిపారు. తొలి కేబినేట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ద, రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చెబుతారన్నారు. రేపటి గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి ఉంటుందన్నారు.
ఓ ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో 45 వేల ఉద్యోగాలు ఇస్తామంటూ చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ఉద్యోగాలు ఎలా ఇస్తారని అడిగితే ఇస్తామని చెప్తున్నాడని వెల్లడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు ఎలా ఉంటుందో వాళ్లకు కూడా తెలియాలని కేటీఆర్ అన్నారు.