2024 పార్లమెంట్, ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ(TDP),జనసేన(janasena), బీజేపీ(BjP) కూటమి సంయుక్తంగా మేనిఫెస్టో(Manifesto)ను విడుదల చేసింది. మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు(Chandrababu home) నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ కీలక నేతలు కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలోని కీలక అంశాలను మీడియాకు వివరించారు. అయితే, కూటమి మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లను ఈసారి రిపీట్ కావొద్దనే ఉద్దేశంతో ఉమ్మడిగా మేనిఫెస్టోను అమలు చేయడమే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి కీలక నేతలు నిర్ణయించారు.
కూటమి మేనిఫెస్టోలోని కీలక అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే..
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20వేలు అందివ్వనున్నారు. ఇక ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15వేలు అందజేత, దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల ఆడవారికి రూ.1500 సాయం,
మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, బీసీ సబ్ ప్లాన్ కింద రూ.1.50 లక్షల కోట్ల ఖర్చు, ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, పాడి పరిశ్రమకు ప్రత్యేక రుణాలు, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మాణులకు రూ.25 వేల జీతం, గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ మేనిఫెస్టో కేవలం టీడీపీ-జనసేన పార్టీలకు మాత్రమే వర్తిస్తుందని, జాతీయ పార్టీ అయిన బీజేపీకి వర్తించదని చంద్రబాబు పేర్కొన్నారు.