వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే దూకుడును పెంచాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీపడుతున్నాయి. అయితే, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, రెండు పార్లమెంట్ సెగ్మంట్లలో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా టఫ్ ఫైట్ ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌పై గులాబీ జెండా ఎగురుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Mla Harish Rao)ధీమా వ్యక్తంచేశారు.సంగారెడ్డిలో బుధవారం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ‘కేసీఆర్ సిరిసిల్ల పర్యటనలో భాగంగా వడ్ల బోనస్ గురించి ప్రశ్నిస్తే..రేవంత్ రెడ్డి డ్రాయర్ ఉడదీస్తా అంటాడు.
నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి?
ఎన్నికల ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్, ఇప్పుడు నోసిటితో వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉంది.ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయింది.కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసింది.ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుంది. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకురాని హస్తం లా మారింది.
2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉంది.ఈ సారి కూడా మెదక్ గడ్డపై (Medak) బీఆర్ఎస్(BRS) జెండా ఎగురుతుంది’అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇదిలాఉండగా, ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ సైతం తెలంగాణలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుందో చెప్పేశాడు. రాష్ట్రంలో బీజేపీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేసులో ఉంటుందని కుండబద్దలు కొట్టేశాడు. దీంతో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం కావడం పక్కా అని చెప్పకనే చెప్పాడు. ఇప్పటికే పలు సర్వేలు సైతం ఈ విషయాన్ని స్పష్టంచేశాయి.