గగన్యాన్ మిషన్(Gaganyan Mission)లో భాగంగా అంతరిక్షం (space)లోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా గగన్‌యాన్ ద్వారా రోదసీలోకి వెళ్లనున్నారు.
21వ శతాబ్దంలో భారత్ ప్రపంచస్థాయి దేశంగా అవతరిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. అన్ని రంగాల్లో భారత్ పురోగమిస్తోందన్నారు. చంద్రయాన్, గగన్యాన్ వంటి ప్రాజెక్టుల్లో మహిళల పాత్ర ఎనలేనిదని మోడీ కొనియాడారు. వారి భాగస్వామ్యం లేనిదే ఈ ప్రాజెక్టులు సాధ్యమయ్యేవి కాదని పేర్కొన్నారు. గగన్యాన్ మిషన్లో చాలా వరకు భారత్లో తయారైన పరికరాలను ఉపయోగించడం గర్వకారణమని ప్రధాని వెల్లడించారు.
గగన్‌యాన్ ప్రయోగంలో పాల్గొనేందుకు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగడ్ ప్రతాప్, శుభాన్షు శుక్లాకు శిక్షణ కొనసాగుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లనున్నారు. ఒకటి నుంచి మూడు రోజులపాటు వారిని అక్కడే ఉంచి తిరిగి భూమి మీదకు తీసుకొస్తారు. కక్ష్యలోకి వెళ్లిన వారిని తిరిగి తీసుకొచ్చే క్రమంలో సముద్ర జలాల్లో ల్యాండ్ చేయనున్నారు.
అదేవిధంగా దేశాభివృద్ధి ప్రయాణంలో కొన్ని ఘట్టాలు భవిష్యత్ను నిర్దేశించేవిగా ఉంటాయని ప్రధాని మోడీ తెలిపారు. ‘‘గగన్యాన్ మిషన్కు ఎంపికైన వ్యోమగాములు వీరు నలుగురు వ్యక్తులు మాత్రమే కాదు… 140 కోట్ల మంది ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు. 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు స్పేస్లో అడుగుపెట్టనున్నారు. ఈసారి వ్యోమగాములను పంపించే రాకెట్ మనం సొంతంగా తయారు చేసుకున్నది. టైమ్, కౌంట్డౌన్ అన్నీ మనవే.” అని మోడీ పేర్కొన్నారు.