హిందువులకు వ్యతిరేకంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వం వ్యవహరిస్తోందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వినాయకుల నిమజ్జనం హుస్సేన్ సాగర్ (Hussain Sagar) లోనే జరగడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కానీ కొందరు గణేష్ నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుందని కోర్టులో పిటిషన్ వేశారని, ఇది ప్రభుత్వ కుట్రేనని ఆయన మండిపడ్డారు.
హుస్సేన్ సాగర్ లోకి అనేక రకాలుగా ఫ్యాక్టరీల వ్యర్థాలు వస్తుంటాయి, వాటి వలన కూడా కాలుష్యమవుతుంది…కానీ కేవలం వినాయక విగ్రహాల వలనే హుస్సేన్ సాగర్ పొల్యూట్ అవుతుందని అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కోర్టులో ప్రభుత్వ తరపు న్యాయవాది సరైన రీతిలో వాదించలేకపోవడం వల్లే పీవోపీ వినాయకులను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు.
అసెంబ్లీ సాక్షిగా హుస్సేన్ సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటిదాకా ఎందుకు మార్చలేకపోయారని ప్రశ్నించారు. వినాయకుడిని నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూషన్ అవుతుంది అనే రిపోర్టు రాష్ట్ర కాలుష్యం నియంత్రణ మండలి వద్ద లేదా? మరి ఉంటే ఆ రిపోర్టును జడ్జి ముందర ఎందుకు పెట్టలేదని అడిగారు.
గణేష్ నిమజ్జనానికి సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇలాంటి తీర్పుని ఇవ్వడం వెనక ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పీఓపీ గణేష్ ల వల్ల హుస్సేన్ సాగర్ పొల్యూట్ కాదని జీవో ఇచ్చిందని, ఆ జీవోను హైకోర్టు జడ్జి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేదన్నారు.
ఎప్పటిలాగే గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే జరుగుతుందని రాజాసింగ్ చెప్పారు. తాము చేసే నిమర్జన కార్యక్రమానికి ఎవరైనా అడ్డుపడితే, అప్పుడు ఏర్పడే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.