పెద్దపల్లి జిల్లా మంథని (Manthani) లో వినాయక నిమజ్జనం (Ganesh Immersion) ఎంతో ఘనంగా జరుగుతుంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడి విశ్వబ్రాహ్మణులు నిర్వహించే శోభాయాత్ర మరీ ప్రత్యేకం. ప్రతీ ఏటా ఏదో ఒక ప్రత్యేక వాహనంలోనో, వస్తువులోనో నిమజ్జనానికి తరలివెళ్తాడు బొజ్జ గణపయ్య. అందుకే, నిమజ్జనం రోజు ఇక్కడి వినాయకున్ని చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు.
ఈసారి కూడా వినూత్న రీతిలో ‘ఇస్రో’ రాకెట్ లో గణపయ్యను నిమజ్జనానికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక గణపతిని చూసేందుకు జిల్లాలోని పలు గ్రామాల నుంచి భక్తులు మంథనికి వచ్చారు. శోభాయాత్రలో గణేశ్ ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. గత రెండు, మూడు దశాబ్దాలుగా వినాయకుడి నిమజ్జనం కోసం విశ్వ బ్రహ్మణ గజాణన మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ప్రతి ఏడాది సుమారు నెల రోజుల పాటు శ్రమించి వినూత్న రీతిలో వినాయకుడి కోసం వాహనాలు తయారు చేయిస్తోంది. దీంతో ప్రతి ఏడాది నిమజ్జన వేడుకల్లో ఇక్కడి గణపతి ప్రత్యేక అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. గతేడాది నిమజ్జన వేడుకల్లో కొబ్బరి కాయలో బొజ్జ గణపయ్యను పెట్టారు.
అంతకు ముందు ఆది శేషుడిపై ఒకసారి, కలశంలో మరోసారి, హెలికాప్టర్ లో ఇంకోసారి ఇలా రకరకాల వాహనాల్లో నిమజ్జనానికి తీసుకెళ్లారు. ఇక ఇదే కమిటీ ఏర్పాటు చేసిన టైటానిక్ షిప్ లో నిమజ్జానికి బయలు దేరిన గణపతి గురించి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకున్నారు.