తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీలోకి వలస వెళ్లారు.మరికొందరు ఇవాళ రేపో వెళ్లేందుకు టైం కోసం వెయిట్ చేస్తున్నారు.అధికార పార్టీలో ఉంటే అభివృద్ది సాధ్యమని, ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గ ప్రజలకు కూడా ఏమీ చేయలేమని స్టేట్మెంట్స్ ఇస్తూ పార్టీలు మారుతున్నారు.
ఈ క్రమంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (BRS Mla Gangula kamalakar) కూడా పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్(Congress) పార్టీలోని కీలక నేతలతో టచ్ లోకి వెళ్లారని, త్వరలోనే పార్టీ కండువా కప్పుకుంటారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంపై తాజాగా గంగుల స్పందించారు.
అదంతా ఉత్త ప్రచారం మాత్రమేనని, తాను పార్టీమారే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాజకీయాల కోసమే రైతుల వద్దకు వెళ్తున్నారని చేస్తున్న ఆరోపణలపై గురువారం ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే రైతులు కష్టాలు పడుతున్నారని విమర్శించారు.కేసీఆర్ నల్గొండకు వెళ్లగానే లిఫ్ట్ ద్వారా కాలువల్లోకి నీళ్లను వదులుతున్నారని గుర్తుచేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ అని అంటున్నారని, జూన్ 4న ఫలితాలు వచ్చాక ఎవరికి ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయో వేచి చూడాలన్నారు.