ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ( Antonio Guterres) సంచలన వ్యాఖ్యలు చేశారు. గాజా (Gaza) నగరం ఇప్పుడు పిల్లలకు శ్మశానవాటికగా మారుతోందన్నారు. గాజాలో నెలకొన్న పీడకల మానవత సంక్షోభం కన్నా ఎక్కువ అని పేర్కొన్నారు. గాజాలో కాల్పుల విరమణ చేపట్టాల్సిన అసవరం ప్రతి గంటకూ పెరిగిపోతోందన్నారు.
వివాదానికి కారణమైన రెండు దేశాలు, నిజానికి అంతర్జాతీయ సమాజంపై కూడా కాల్పుల విరమణకు కృషిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ అమానవీయ సామూహిక ఘటనలను ఆపి, గాజాకు మానవత సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందయి వెల్లడించారు.
ఇటీవల ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో శరణార్థులకు ఐరాస సహాయక బృందాలు సహాయాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఐరాస సహాయక బృందాలకు చెందిన 89 మంది మరణించారు. మృతులకు సంతాప సభను నిర్వహించారు. ఆ సభలో ఆయన పాల్గొన్నారు.
అంతకు ముందు గాజాలో పిల్లల మరణాలపై యునిసెఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్దంలో మొదట డజన్ల కొద్ది మరణించారని, ఆ తర్వాత వందలకు చేరిందని, ఇప్పుడు ఆ సంఖ్య వేలు జరిగిందని యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ అన్నారు. ఇదంతా కేవలం 15 రోజుల్లోనే జరిగిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.