సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఈమధ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఉదయనిధిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే.. తాను తప్పేం మాట్లాడలేదని ఏం చేసుకుంటారో చేసుకోండని అదే స్థాయిలో ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. ఇతర డీఎంకే నేతలు కూడా ఉదయనిధికి వంత పాడారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై (Annamalai).. డీఎంకే నేతలపై విరుచుకుపడ్డారు.
ట్విట్టర్(ఎక్స్)లో ఓ పోస్ట్ పెట్టిన అన్నామలై.. ఉదయనిధితోపాటు పీకే శేఖర్ బాబు (PK Shekar Babu)పై సెటైర్లు వేశారు. సనాతన ధర్మం హిందూయిజం ఒక్కటి కాదంటూ వారు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ.. 12వ తరగతి పుస్తకంలోని పాఠానికి సంబంధించి ఫోటోలను పోస్ట్ చేశారు.
అన్నామలై ట్వీట్
‘‘తిరు ఉదయనిధి స్టాలిన్, తిరు శేఖర్ బాబు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత అన్ని వైపుల నుంచి వస్తున్న ఖండనలు, విమర్శలతో హిందూయిజం, సనాతన ధర్మం వేర్వేరు అని చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన 12వ తరగతి పుస్తకంలో సనాతన ధర్మం, హిందూయిజం ఒక్కటే అని ఉంది. సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మమని పేర్కొన్నారు. కనుక, ఉదయనిధి స్టాలిన్, పీకే శేఖర్ బాబు 12వ తరగతిలో చేరి జ్ఞానోదయం పొందాలి’’