ప్రజాపాలన (Praja Palana)లో ప్రజలకు సేవ అటుంచితే దరఖాస్తుదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.. తొలి రోజే వేల సంఖ్యలో దరఖాస్తుదారులు కేంద్రాలకు పోటెత్తారు. అరకొరగా తీసుకువచ్చిన దరఖాస్తులు ప్రతి కేంద్రంలో మొదటి గంటలోనే అయిపోవడంతో.. జిరాక్స్ సెంటర్లకు వెళ్లి తీసుకోవాలని ప్రజలకు సిబ్బంది తెలియజేయడం కనిపించింది.
దీంతో ఇదే అదనుగా భావించిన కొందరు దళారులు ఒకో దరఖాస్తు ఫారాన్ని రూ.40-రూ.50 తీసుకొని ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. మరోవైపు, దరఖాస్తుల కోసం మీసేవ, జిరాక్స్ సెంటర్ల వైపు ప్రజలు పరుగులు తీస్తుండటంతో.. కొత్త దందా మొదలైందని అంటున్నారు.. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకొంటున్న కొందరు.. సందట్లో సడేమియాలా మీసేవ సెంటర్ల, జిరాక్స్ సెంటర్లు నిర్వాహకులు, కొన్ని చోట్ల కిరణాషాపు యాజమానులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.50 నుంచి 100 వరకు రేటు ఫిక్స్ చేశారు..
మరోవైపు ఈ విషయం జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ రోనాల్డ్ రాస్ (Commissioner Ronald Ross) దృష్టికి వెళ్లడంతో.. ప్రజాపాలన అప్లికేషన్లు (Application) అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. 5 గ్యారంటీలకు సంబంధించిన అభయ హస్తం దరఖాస్తులకు ఎలాంటి కొరత లేదన్న జీహెచ్ఎంసీ కమిషనర్.. అందరికీ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బయట కొనుగోలు చేయవద్దని సూచించారు.
ప్రజాపాలన అప్లికేషన్లు శివారులోని పటాన్‌చెరు (Patancheru)లో రూ. 20 చొప్పున అమ్మిన మీ సేవా నిర్వాహకుడిపై అధికారులు గురువారం కేసు నమోదు చేశారని రోనాల్డ్ రాస్ అన్నారు. కాగా.. ప్రజా పాలన పథకం అప్లికేషన్ ఫారమ్ ను మీ సేవలో రూ.60 కు విక్రయిస్తున్నారని నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమం నెల రోజులు పొడగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా పాలన పథకంలో అధికారులు తగిన ప్రచారం చేయలేదని మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించాలని రాజాసింగ్ వెల్లడించారు..