రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘స్పూన్ ఫీడింగ్ కిడ్స్’ అని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధైర్యంగా బీజేపీ(BJP)కి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్న వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు.
రాహుల్ చర్యలు అలా అనిపించడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు సంకోచిస్తున్నారని ఆజాద్ విమర్శించారు. అదేవిధంగా మైనార్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. సురక్షిత స్థానాలను ఎంచుకోవడాన్ని సైతం ఆయన ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దుల్లా వ్యక్తిగతంగా ఎలాంటి త్యాగాలు చేయలేదన్నారు. రాజకీయ వారసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారని.. సొంతంగా వారు చేసిందేమీ లేదని విమర్శించారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన గులాంనబీ ఆజాద్ రెండేళ్ల కిందట పార్టీ నుంచి బయటకు వచ్చారు.
రాహుల్ గాంధీ పార్టీ బలోపేతానికి సంస్థాగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ రాకతోనే కాంగ్రెస్ నాశనం మొదలైందంటూ నాడు మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వం కారణంగానే తాను వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన డెమోక్రాటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.