యూకే (UK) లో గురుద్వార (Gurudwara) వద్ద జరిగిన ఘటనపై గ్లాస్గో గురుద్వారా స్పందించింది. గురుద్వార లోకి ప్రవేశించకుండా భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు గ్లాస్గో గురుద్వారా వెల్లడించింది. ఈ ఘటనపై భారత హైకమిషనర్ దొరై స్వామి (Dorai Swamy) కి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆయనకు గురుద్వార లేఖ రాసింది.
భారత హైకమిషనర్ ను అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులకు గురుద్వారకు ఎలాంంటి సంబంధం లేదని పేర్కొంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో గురుద్వారకు తెలియదన్నారు. ఇది ఇలా వుంటే గ్లాస్గో గురుద్వార నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని దొరై స్వామికి ఈ ఏడాది అగస్టులో ఆహ్వానం అందింది. దీంతో ఆయన గ్లాస్గో గురుద్వారకు వెళ్లారు.
ఆయన్ని గురుద్వారలోకి వెళ్లకుండా అక్కడి ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకున్నారు. గురుద్వార వద్దకు చేరుకోగానే ముగ్గురు వ్యక్తులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఆయన కారులో వుండగానే డోర్ ను బలవంతంగా తీసేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నం చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు ఈ ఘటనకు సంబంధించి వీడియోను ‘సిక్కు యూత్ యూకే’తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది.
కొద్ది క్షణాల్లోనే వీడియో వైరల్ అయింది. ఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరపుతున్నారు. స్థానిక ఎంపీ స్టేట్ మెంట్స్ కూడా పోలీసులు ఇప్పటికే తీసుకున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిని షంషీర్ సింగ్, రణవీర్ సింగ్ లుగా గుర్తించినట్టు సమాచారం. వారిద్దరూ లండన్‌లో ఉంటున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.