తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల(JOBS)కు సంబంధించి పలు నోటిఫికేషన్లు(Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఒకటి. గ్రూప్స్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా కొత్తగా విడుదలయ్యాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పేపర్ లీకేజీ కారణంగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు మార్లు గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు వాయిదా పడ్డాయి.
ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పోలీసు కానిస్టేబుల్స్,స్టాఫ్ నర్సు, గురుకుల టీచర్లకు సంబంధించిన ఖాళీల భర్తీలను పూర్తి చేసి అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను సైతం అందజేసింది. త్వరలోనే డీఎస్సీ పరీక్షలు జరుగాయని నోటిఫికేషన్లో పేర్కొంది.
కాగా, డీఎస్సీకి సంబంధించి ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఈ క్రమంలోనే డీఎస్సీ(DSC)కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టీశాట్(T-SAT) శుభవార్త చెప్పింది. వారి కోసం ఉచితంగా ముఖ్యమైన క్లాసులను(FREE CLASSES)బోధిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 9 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు టీశాట్ ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని పేర్కొంది. గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై టెలికాస్ట్ అయ్యే లైవ్ ప్రోగ్సామ్స్, మరుసటి రోజు విద్య చానెల్లో సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ అవుతాయని వెల్లడించింది.