రాష్ట్రంలోని అన్నదాతల(Formers)కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) శుభవార్త చెప్పింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు అన్ని రకాల విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా మిగతా విత్తనాలపై సబ్సిడీ(Subsidy)ని గత సర్కారు ఎత్తేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పత్తి, వరి, కంది,పెసర, మొక్కజొన్న, సోయాబీన్, మినుము, వేరుశనగ, తదితర విత్తనాలకు 35 నుంచి 65 శాతం సబ్సిడీని వ్యవసాయ శాఖ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వ ఖజానాపై రూ.170కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం అంచనాకు వచ్చింది.
ఇదిలాఉండగా యాసంగి సీజన్ ప్రస్తుతం నడుస్తుండగా నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పంటలకు నీరందించాలని రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. ఇటీవల నీరందక ఎండిపోయిన పంటలకు రైతులు నిప్పు పెట్టిన ఘటనలు కూడా రాష్ట్రంలో వెలుగుచూశాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలకు నీరు అందించాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, తమ ప్రభుత్వ హయాంలో సంతోషంగా ఉన్న అన్నదాతలు ప్రస్తుతం రోడ్డెక్కె పరిస్థితులు వచ్చాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. రైతు బంధు, రుణమాఫీ, రైతు బీమాపై కాంగ్రెస్ పార్టీ స్పందించడం లేదని, రైతులను మోసం చేసిందని ఆ పార్టీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.