విపక్ష ఇండియా కూటమిని (India Alliance) వీడి బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar)ఎన్డీఏలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నితీశ్ కుమార్ తరుచూ కూటములు మారడంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను నితీశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటూ పిలుస్తారని ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్ ఏ ఉద్దేశంతో ఇండియా కూటమిని ప్రారంభించారో తమకు తెలియదని చెప్పారు. ఆయన ఇప్పటి వరకు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తొమ్మిది సార్లు మారడన్నారు.
ఎప్పుడూ 400 సీట్లపై పెద్ద ఎత్తున వాదనలు వినిపించే పార్టీ వాస్తవికతను ఈ పరిణామాలు చెబుతున్నాయని చెప్పారు. బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమిని వీడి నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమికి తిరిగి వెళ్లడం వెనక ప్రధాని మోడీ పాత్ర ఉందని ఆరోపించారు.
ఇది ప్రధాని నరేంద్ర మోడీ పన్నిన ముందస్తు కుట్ర అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాలు ఇండియా కూటమి అవకాశాలపై ఎలాంటి ప్రభావమూ చూపబోవని స్పష్టం చేశారు. ఇది ఇలా వుంటే ఆదివారం సాయంత్రం 5 గంటలకు నితీశ్ కుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.