కెనడా(Canada) వేదికగా జరిగిన ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ(FIDE Candidates Chess Tourney)లో భారత్‌కు చెందిన చెస్ ప్లేయర్ గుకేష్(Gukesh) విజేతగా నిలిచాడు. సంచలన ప్రదర్శనతో 17 ఏళ్ల గుకేష్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అత్యంత చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించి గుకేష్ రికార్డు నెలకొల్పాడు.
ఈ సందర్భంగా విశ్వనాథన్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా గుకేష్‌కు అభినందనలు తెలిపారు. అత్యంత పిన్న వయస్కుడిగా క్యాండిడేట్స్ టోర్నీ టైటిల్ గెలిచిన గుకేశ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ‘నీ ఘనతకు చెస్ కుటుంబమంతా గర్వపడుతోంది. నువ్వు ఆడిన తీరు నన్ను వ్యక్తిగతంగా ఆకట్టుకుంది. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని విజేతగా నిలవడం అభినందనీయం’ అంటూ పేర్కొన్నారు.
క్యాండిడేట్స్ టోర్నీలో 14 పాయింట్లకు 9 పాయింట్లను గుకేష్ సాధించాడు. చివరి రౌండ్లో అమెరికన్ హికారి నకమురాతో గుకేష్ గేమ్ డ్రా చేసుకున్నాడు. మరోవైపు నెపోమ్నియాషి (రష్యా)- ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్ కూడా డ్రా అయింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ దక్కించుకున్న రెండో భారతీయుడిగా గుకేష్ రికార్డు కైవసం చేసుకున్నాడు.
ఇక, ఫిడే క్యాండిడేడ్స్ చెస్ టోర్నీలో ప్రతిభ చాటిన గుకేష్ ఈ ఏడాది ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. గతంలో మాగ్నస్ కార్ల్సన్, కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు గుకేష్ విజయం సాధిస్తే అతి పిన్న వయస్సు 17ఏళ్లకే ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. గుకేశ్ 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. గతేడాది విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కి నెట్టి భారత్ టాప్ చెస్ ర్యాంకర్‌గా నిలిచాడు.