ఖలిస్థాన్ ఉగ్రవాది (Khalistani terrorist), నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) రెచ్చి పోయాడు. ఏకంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ను హతమారుస్తామంటూ హెచ్చరికలు చేశాడు. సీఎంతో పాటు రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్‌ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
రిపబ్లిక్ డే రోజు వాళ్లిద్దరనీ హతమారుస్తానన్నాడు. గణతంత్ర దినోత్సవం రోజు భగవంత్ మాన్ ను హత్య చేసేందుకు గ్యాంగ్ స్టర్స్ అంతా కలిసి రావాలని పిలుపునిచ్చాడు. గ్యాంగ్ స్టర్లను ఇటీవల పంజాబ్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణచి వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పన్నూన్ తాజాగా బెదిరింపులు చేసినట్టు తెలుస్తోంది.
ఈ బెదిరింపులపై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ స్పందించారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసులు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోందని వివరించారు. పన్నూన్ బెదిరింపులపై కేసు నమోదు చేశామని తెలిపారు. పన్నూన్ బెదిరింపులపై కఠిన చర్యలను తీసుకుంటామని గౌరవ్ యాదవ్ చెప్పారు
గత నెలలో కూడా పన్నూన్ ఓ వీడియో విడుదల చేశాడు. డిసెంబర్ 13 లేదా ఆ లోగా పార్లమెంట్ భవనంపై దాడి చేస్తామని హెచ్చరించాడు. అంతకు ముందు ఎయిర్ ఇండియాకు కూడా పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.