రానున్న వేసవి దృష్ట్యా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశముందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి (Gutta Sukhender Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ (Nalgonda)లోని నివాసంలో ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దురదృష్టవశాత్తు వర్షాలు లేవని తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయన్నారు.
సాగర్ కింద, ఏఎంఆర్పీ, ఆయకట్టు కింద క్రాఫ్ హాలీడేలు ప్రకటించారన్నారు. బోర్లు, బావుల కింద అనేక పంటలు సాగవుతున్నాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటి బావులు ఎండిపోయే పరిస్థతి నెలకొందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నందున తెలంగాణ కాంగ్రెస్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే 15టీఎంసీలు నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.
ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని కోరారు. పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలోనే ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ప్రజల బాధలను ముందుగానే అర్థం చేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే సాగు నీటిని విడుదల చేయాలన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని నిలబెట్టినా సహకారం అందిస్తానన్నారు గుత్తా సుఖేందర్రెడ్డి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్న ఆయన సమన్వయంతో పని చేస్తేనే ఫలితాలు వస్తాయన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను పార్టీ నిర్ణయిస్తుందని, ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికే టికెట్లు ఇస్తారని చెప్పారు.