ప్రధాని మోడీ (Modi) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender Reddy). దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ అబద్దాలు చెప్తూ, తెలంగాణ (Telangana) పై విషం కక్కుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పాటులో రక్తం ఏరులై పారింది అంటున్న మోడీ ఎక్కడ రక్తం ఏరులైయిందో చెప్పాలన్నారు. హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నప్పుడు బలవంతంగా ఉమ్మడి రాష్ట్రం చేశారని…2001 కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ గురించి మళ్ళీ చర్చ వచ్చిందని చెప్పారు. 2014 లో వచ్చిన తెలంగాణాపై దేశ ప్రధాని విషం కక్కుతూ మాట్లాడడం సరైంది కాదన్నారు. ఎప్పుడైనా పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యేటప్పుడు డోర్ క్లోజ్ చేయడం ఆనవాయితీ అని తెలిపారు.
తుక్కుగూడ కాంగ్రెస్ సభలో సోనియా గాంధీ అబద్దాలు మాట్లాడారని, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకు పథకాలు ఎందుకు అమలుకావడం లేదు..? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కేసిఆర్ తో మాత్రమే సాధ్యం అని, బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొడుతుందని గుత్తా అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కేవలం ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయని.. వాటిని నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.
మహిళా బిల్లు గత తొమ్మిదేళ్లలో ఎందుకు పెట్టలేదని నిలదీశారు గుత్తా. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యతిరేకతను పోగొట్టుకోవడం కోసం కొత్త బిల్లులు తెస్తుందన్నారు. అవినీతి సొమ్ము కక్కిస్తాం అని చెప్పిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు.