హమాస్ (Hamas) మిలిటెంట్లు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ (Israel) పై మరోసారి అక్టోబర్ 7 తరహా దాడులను చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ కు చోటు లేదని హమాస్ తీవ్రవాద గ్రూపునకు చెందిన నిర్ణయాధికార పొలిటికల్ బ్యూరో సభ్యుడు గాజీ హమాద్ తెలిపారు.
ఇజ్రాయెల్ ను పూర్తిగా నాశనం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని గాజీ హమాద్ వెల్లడించారు. లెబనాన్‌కు చెందిన ఓ ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. అల్ అక్సా ఫ్లడ్ (అక్టోబర్ 7న హమాస్ ఆపరేషన్ పేరు) మళ్లీ పురావృతం అవుతుందన్నారు. ఒక్క సారి కాదు, రెండు సార్లు ఎన్ని సార్లైనా దాడి చేయాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఇజ్రాయెల్ పై ఎన్ని సార్లైనా దాడి చేసే సామర్థ్యాలు తమకు ఉన్నాయని వెల్లడించారు. తమ దేశాన్ని అమరవీరుల దేశంగా పిలుస్తామన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించడాన్ని గర్వంగా భావిస్తామన్నారు. ప్రపంచంలో ఇజ్రాయెల్ కు స్థానం లేదన్నారు. అరబ్, ఇస్లామిక్ దేశాలకు ఇజ్రాయెల్ అనేది రక్షణ పరంగా, రాజకీయంగా, సైన్యం పరగా ఒక విప్తత్తుగా మారిందన్నారు.
అందుకే ఇజ్రాయెల్ దేశాన్ని ఈ ప్రపంచ పటం నుంచి తుడిచి వేయాలన్నారు. ఈ వ్యాఖ్యలు చేయడానికి తాము సిగ్గుపడటం లేదన్నారు. ఇజ్రాయెల్ కు ఖచ్చితంగా మరచిపోలేని గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ దాడులు మళ్లీ, మళ్లీ చేస్తూనే ఉంటామన్నారు. ఇజ్రాయెల్ పై తాము చేసిన దాడులు న్యాయమైనవేనని వివరించారు.