హమాస్(Hamas)ను అంతమొందించాలని ప్రామిస్ చేసుకున్నా అని.. తమను ఎవరూ ఆపలేరని ఇజ్రాయెల్(Israel) ప్రధాని మెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) అన్నారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken)కు తెలిపానన్నారు.
జెరూసలెంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో శుక్రవారం బ్లింకెన్‌తో నెతన్యాహు సమావేశమయ్యారు. జెరూసలేంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులను హమాస్ ఉగ్రవాదులు కాల్చి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో ఎనిమిది అమాయకులు గాయాలపాలయ్యారు. అయితే ఉగ్రదాడి అనంతరం వీరిద్దరి భేటీ జరిగింది.
హమాస్ చెరలో మిగిలిన బందీలందరినీ విడిపించే ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనాలో శాంతి, స్వేచ్చ, భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని బ్లింకెన్ తెలిపినట్లు ప్రకటనలో స్పష్టం చేసింది.
సైనిక కార్యకలాపాలకు ముందు మానవతా, పౌర రక్షణ విషయంలో చర్యలను నిర్ధారించాలని నెతన్యాహును బ్లింకెన్ కోరినట్లు తెలిపింది. గాజా స్ట్రిప్‌లో కీలకమైన మానవతా సాయం అందించాల్సిన విషయమై చర్చించినట్లు తెలిపింది. అదేవిధంగా వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై హింసకు పాల్పడుతున్న సెటిలర్ అతివాదులను నియంత్రించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధానిని కోరినట్లు తెలిపింది.