రాష్ట్ర రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గరంగరంగా మారుతున్నాయి.. ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకొంటున్న నేతలు.. ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు.. ఇక బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతలు మధ్య మాటలు నిప్పులో ఉప్పులా పెళుతున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట (Siddipet) ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) రాష్ట్ర మహిళలకు సంచలన పిలుపు ఇచ్చారు.
గురువారం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులను చీపుర్లతో కొట్టి తరిమేయండి అని వ్యాఖ్యానించండం చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని మండిపడ్డారు.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరు గ్యారంటీలు అమలు చేశామని తెలుపడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు..
ఈ హామీలు ఎక్కడ అమలయ్యాయో చూపించాలని సవాల్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తే, ఆ రుణమాఫీ అయిన రైతులంతా కాంగ్రెస్‌కే ఓటేయండన్నారు.. రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్కు ఓటేయాలని సూచించారు.. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని ఆరోపించిన హరీష్ రావు.. రాష్ట్ర రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు..
ఇలాంటి సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఐపీఎల్ మ్యాచులు, పార్టీలో చేరికలపై దృష్టి పెట్టారని విమర్శించిన హరీష్ రావు.. ఇలాంటి ముఖ్యమంత్రినా జనం కోరుకొన్నదని ధ్వజమెత్తారు.. అదేవిధంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు..