హర్యానా(Haryana) రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్(CM Manohar Lal Khattar) తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను గవర్నర్ బండారు దత్రాత్రేయకు సమర్పించారు. ఆ వెంటనే కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది.
హర్యానా సీఎంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయబ్ సింగ్ సైనీకి బాధ్యతలను అప్పగించింది. నయబ్ సింగ్ సై కురుక్షేత్ర లోక్సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమి విచ్ఛిన్నం ఏర్పడింది. హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం రాజీనామా చేశారు. 90 స్థానాలు ఉన్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీకి 10మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హరియాణ లోక్హిత్ పార్టీ-హెచ్ఎల్పీకి చెందిన ఒకఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు.
బీజేపీతో విభేదాల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై జేజేపీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల ముంగిట హర్యానాలో రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతుండటం గమనించాల్సిన విషయం. మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశమున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.