మాజీ సీఎం కేసీఆర్(KCR) తెలంగాణ ప్రజల(Telangana people) నమ్మకాన్ని తిరిగి పొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బస్సు యాత్ర(BUS TOUR) ద్వారా ప్రజలకు చేరువ అవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి పెద్దగా వెళ్లేవారు కాదు. కేవలం ఎన్నికప్పుడే అడ్డగోలు హామీలు, పథకాల పేరిట వారిని బురిడి కొట్టించేవారు.
ప్రతీసారి తాను తెలంగాణ కోసమే పుట్టానని, ఇక్కడి ప్రజలను ఉద్దరించడానికి వచ్చానని.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆగమైతది, గత్తరస్తది అన్న రేంజులో ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకున్నారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం సాధనలో కేసీఆర్ కృషి ఎంత ఉందో.. తెలంగాణ సమాజం, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరులు వారిది అంతే కృషి ఉంది.
కానీ, కేసీఆర్ మాత్రం చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించానని బాగా పబ్లిసిటీ చేసుకున్నారు. తన పార్టీ పేరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండటంతో ప్రజలు కూడా ఉద్యమనేతకు బాగా కనెక్ట్ అయ్యారు. అప్పట్లో ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం వంటి మేధావులు కూడా కేసీఆర్ చెంతనే ఉండటంతో తెలంగాణ సమాజం కూడా కేసీఆర్‌కు రెండు పర్యాయాలు అధికారం కట్టబెట్టారు.
కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తీరులో చాలా మార్పు వచ్చిందని ఆయన పక్కనున్న వాళ్లు, ఉద్యమకారులు, మేధావులు చెప్పుకొచ్చారు. కేసీఆర్ కూడా తన పార్టీ ఇక ఉద్యమపార్టీ కాదని, ఫక్తూ రాజకీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. రాష్ట్రాన్ని పచ్చగా చేశానని, తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించేశానని.. ఇక దేశం వంతు వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చారు.
దీనికి తోడు ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద నియోజకవర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్‌కు మొరపెట్టుకుందామంటే ఆయన అపాయింట్ దొరకదు. సార్ గారు కనిపించరు. ఎప్పుడు ఫాంహౌస్‌లోనే ఉంటారు. పేరు మార్పుతో అటు బీఆర్ఎస్ పార్టీతో ఉన్న సెంటిమెంట్ క్రమంగా ప్రజల్లో దూరమైంది.ఇక ఎమ్మెల్యేల ప్రవర్తన ఇంకా దానికి ఆజ్యం పోసింది. తీరా చూస్తే కేసీఆర్ అధికారానికి దూరమయ్యారు.
పార్టీ పేరు మార్పుతోనే ఉద్యమనేతను,ఉద్యమ పార్టీకి ప్రజలు దూరమయ్యారనే టాక్ అప్పట్లో విపరీతంగా వచ్చింది. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు అదే అని కొందరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ బాపు అని పేరు కూడా క్రమంగా మసకబారింది.తీరా చూస్తే కేసీఆర్‌ను సొంత పార్టీ నేతలే ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మరి ఈ బస్సు యాత్ర కేసీఆర్ అనుకున్నంత మైలేజ్ తీసుకొస్తుందా? లేదా అనేది త్వరలోనే తెలియనుంది.