బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలో మరో పార్టీ చేరింది. కర్ణాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (JDS)ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రకటించింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరుతున్నట్టు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమార స్వామి ప్రకటించారు.
గత కొంత కాలంగా బీజేపీతో జేడీఎస్ పొత్తుపై వార్తలు వచ్చాయి. దీన్ని జేడీఎస్ నేత కుమార స్వామి ఖండించారు. ఆ తర్వాత ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్న మాట నిజమేనని కుమార స్వామి చెప్పారు. తాజాగా ఈ రోజు రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్టు వెల్లడించారు. ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుల గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలిపారు.
జేడీఎస్ నేతలతో సమావేశానికి సంబంధించి ఫోటోలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా షేర్ చేశారు. ఎన్డీఏలో చేరాలని జేడీఎస్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం పట్ల తాను సంతోషంగా వున్నట్టు నడ్డా వెల్లడించారు. జేడీఎస్ నేతలకు కూటమిలోకి సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు చెప్పారు. జేడీఎస్ చేరిక ఎన్డీఏను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
మరోవైపు దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి సమావేశం అయినట్టు ట్వీట్ చేశారు. ఎన్డీఏలో చేరాలన్న జేడీఎస్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నట్టు చెప్పారు.