వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రెండు, మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అని అంచనా వేశారు.
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో వ్యాప్తంగా అన్ని మండలాల్లో జోరు వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇండ్లలోకి నీరు చేరింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.. జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం వరకు మొత్తం 50,925 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి కెపాసిటి 90 టీఎంసీలకు గాను 84.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దిగువన నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.