ఈమధ్య కురిసిన భారీ వర్షాలకు (Heavy Rains) తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతానికి మోస్తరు వానలే కురుస్తాయని అంటున్నారు. ఆ తర్వాత భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో 16వ తేదీ దాకా తెలంగాణ (Telangana) లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. నల్లగొండ, హైదరాబాద్, యాదాద్రి, వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో వానలు పడతాయి. ఎండలు తక్కువగా నమోదవుతాయి. కానీ, ఈ ఏడాది ఆగస్టు నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇక ఏపీ (Andhra Pradesh) లో ఇప్పటికే పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రోజులపాటు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో పాటు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈక్రమంలోనే రెండు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని స్పష్టం చేసింది వాతావరణశాఖ.
మరోవైపు, పలు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. 16 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది వాతావరణ శాఖ.