గత వారం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వరదలకు జనం అల్లాడిపోయారు. ఈ క్రమంలో కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ.. జరిగిన నష్టంపై అంచనా వేస్తోంది. అధికారులతో పాటు స్వయంగా ప్రజలను కలుసుకుంటూ వాస్తవ పరిస్థితిపై ఆరా తీస్తోంది.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సలహాదారు కునాల్ సత్యార్థి ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో వ్యవసాయం, ఫైనాన్స్, జలవనరుల శాఖ, విద్యుత్తు, రోడ్డు రవాణా, రహదారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వంటి వివిధ శాఖలు, విభాగాల అధికారులు సభ్యులుగా ఉన్నారు. మంగళవారం హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో వరదలతో దెబ్బతిన్న కాలనీలను పరిశీలించారు సభ్యులు. తెగిన భద్రకాళి చెరువు కట్ట దగ్గరకు కూడా వెళ్లారు. ప్రజలతో మాట్లాడి వరద నష్టం వివరాలు తెలుసుకున్నారు. అలాగే, బుధవారం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటించారు.
భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామానికి వెళ్లారు. కేటీపీపీ గెస్ట్ హౌస్ లో పలు శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మోరంచపల్లిలో ప్రతి ఇంటికి వెళ్లి బాధితుల నుండి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వరద ప్రభావంతో కొట్టుకుపోయిన మోరంచపల్లిలోని బ్రిడ్జి, తెగిపోయిన రోడ్లు, ఇండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. తమ బాధలన్నీ వారికి విన్నవించారు గ్రామస్తులు.
మోరంచపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. వరదలతో గ్రామస్తుల వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. జీవనాధారమైన పంట పొలాలు పాడవ్వగా, పశువులు చనిపోయాయి. ఎటు చూసినా పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చెత్త, బురద పేరుకుపోవడంతో విషజ్వరాలు, అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కేంద్ర బృందానికి వివరించారు. ఇక గురువారం భద్రాచలంలో పర్యటించనుంది కేంద్ర బృందం.