వేసవి(Summer) ప్రారంభం కావడంతో మార్చి ప్రారంభంలోనే ఎండలు(Temperature) దంచికొడుతున్నాయి. మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ 10గంటల లోపే ఎండలు మండిపోతున్నాయి.
భానుడు ప్రజలపై నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో మార్చి నెలలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తెలంగాణ(Telangana)లో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎండల కారణంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు ప్రకటిస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది.
నేటి(ఆదివారం) నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేశారు. రానున్న ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. దక్షిణం నుంచి రాష్ట్రంలోకి తక్కువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది.
ఈ 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. రాత్రిపూట కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదంటున్నారు. తప్పని పరిస్థితుల్లో బయట తిరిగేవారు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.