ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ (Telangana) రాజకీయం హీటెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth) రెండు రోజుల క్రితం డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్ (KCR) కు ఛాలెంజ్ విసిరారు. 17న గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం ముందు ప్రమాణం చేసేందుకు రావాలన్నారు. ఆయన చెప్పినట్టుగానే మంగళవారం గన్ పార్క్ దగ్గరకు వచ్చారు.
రేవంత్ రాకతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ ఉందని ఇది కరెక్ట్ కాదని చెప్పారు. దీంతో పోలీసులతో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపటి తర్వాత రేవంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టులతో హస్తం శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రిటర్నింగ్ అధికారి పర్మిషన్ కావాలని రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు ఖాకీలు. ఈ పరిణామాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ కు షాకిచ్చిన ఎమ్మెల్యే
బీఆర్ఎస్ లో అసంతృప్తులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రేవంత్ రెడ్డిని కలిశారు. బోధ్ టికెట్ విషయంపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో బాపురావు పేరు లేదు. కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయనను కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ కు ఇచ్చారు. అప్పటి నుంచి అంసతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో రేవంత్ రెడ్డిని కలవడంతో ప్రాధాన్యత ఏర్పడింది.