Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి వంతెనలు, రోడ్లు కొట్టుకుపోతుండగా కొండ చరియలు విరిగి పడడంతో అనేక చోట్ల జాతీయ రహదారులను మూసివేశారు. ఈ ప్రకృతి విపత్తుకు ఇప్పటివరకు 74 మంది మరణించారని అధికారులు తెలిపారు. అనేకమంది గాయపడగా పలువురు గల్లంతయ్యారని వారు చెప్పారు. ఈ బీభత్సం వల్ల దాదాపు 10 వేల కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
ఒక్క ప్రజా పనుల శాఖకే 2,491 కోట్ల నష్టం కలిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు వెయ్యి కోట్ల నష్టం వాటిల్లినట్టు తేలింది. తమ రాష్ట్రాన్ని మళ్ళీ అన్నివిధాలా పునరుధ్ధరించేందుకు ఏడాది సమయం పడుతుందని హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు తెలిపారు. సిమ్లా లోని సమ్మర్ హిల్ ప్రాంతంలో గత సోమవారం కొండచరియలు విరిగిపడడంతో దాదాపు 21 మంది మృతి చెందారు.
శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. ఈ రాష్ట్రానికి టూరిజం ద్వారా రావలసిన ఆదాయానికి గండం ఏర్పడింది. స్థానిక ట్యాక్సీ డ్రైవర్లు తాము గతంలో రోజుకు సుమారు రెండు వేలు సంపాదించే వారమని కానీ ఇప్పుడు రోజుకు 200 రూపాయలైనా రావడం లేదని వాపోతున్నారు.
హిమాచల్ లోని అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రభుత్వం నానా పాట్లు పడుతోంది. ఈ నెల 17 న సుమారు వెయ్యి మందిని తరలించారు.