Himachal Pradesh : భారీ వర్షాలు, వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలు పలు పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. బియాస్, రంజిత్ సాగర్ వంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా చాంబా, మండి, సిమ్లా, కులూ, కాంగ్రా వంటి పలు జిల్లాల్లో వేలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అనేక చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ సీజన్ లో కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదల కారణంగా రూ. 7020.28 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.
జూన్ 24 న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జడివాన కురుస్తోందని వారు చెప్పారు. వాహనాలు, ఇళ్ళు, రోడ్లు నీటిలో కొట్టుకుపోవడంతో పలు చోట్ల జాతీయ రహదారులను మూసివేశారు. జూన్ 24 నుంచి ఇప్పటివరకు 257 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. సుమారు 300 మంది గాయపడ్డారని, పెద్ద సంఖ్యలో గల్లంతరయ్యారని తెలిపారు.
కొండచరియలు విరిగిపడడంవల్లో, రోడ్డు ప్రమాదాల్లోనో 66 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. దాదాపు వెయ్యికి పైగా ఇళ్ళు పూర్తిగా దెబ్బ తినగా 7 వేలకుపైగా ఇళ్ళు పాక్షికంగా ధ్వంసమయ్యాయని చెప్పారు.
270 కి పైగా షాపులు, రెండువేలకు పైగా గోశాలలు కూడా దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణశాఖ ప్రకటించింది. ప్రకృతి విపత్తు కారణంగా 200 రోడ్లు కొట్టుకుపోయినట్టు అధికారులు తాజాగా వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేశారు. ఇక ఉత్తరాఖండ్ లోనూ భారీ వర్షాల వల్ల 52 మంది మృతి చెందగా 37 మంది గాయపడ్డారు.