కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul gandi) కేరళలోని వయనాడ్(Vayanad) నియోజకవర్గం నుంచి మరోసారి నామినేషన్(Nomination) దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు, కీలక నేతలు ఉన్నారు. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ కూడా హాజరయ్యారు.
రాహుల్ గాంధీ నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవిట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు సొంత వాహనం కూడా లేదని, ఇళ్లు కూడా లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.55వేల నగదు, రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ.4.33 కోట్ల బాండ్లు, షేర్లు రూ.3.81 కోట్లు, రూ.15.21లక్షల గోల్డ్ బాండ్లు, రూ.4.20లక్షల బంగారు ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా రూ.11.15 కోట్ల స్థిరాస్తులను కూడా కలిగిఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. దీనికి తోడు ఢిల్లీలోని మెహ్రౌలీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీతో కలిపి వ్యవసాయ భూమి ఉన్నట్లు ప్రకటించారు. దాని విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని తెలిపారు.
తనపై నమోదైన క్రమినల్ కేసుల వివరాలను కూడా రాహుల్ మెన్షన్ చేశారు.బీజేపీ నేతల పరువునష్టం ఫిర్యాదులపై దాఖలైన కేసులు సహా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తో ముడిపడి ఉన్న క్రిమినల్ కేసులు, లైంగిక దాడికి గురైన బాధితురాలి కుటుంబ సభ్యుల గుర్తింపును సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు గాను ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదవ్వగా దానిని కూడా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.