అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మృతిచెందగా ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఓ ముస్లిం మహిళ ముందుకొచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసి గొప్ప మనసు చాటుకుంది. కులం, మతం ముసుగులో విద్వేషాలకు పోతున్న ఈ సమాజంలో ఆమె ఆదర్శంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా(Yadadri District) భువనగిరి మండలం(Bhuvanagiri Mandal) రాయగిరి(Rayagiri) చెందిన ముస్లిం దంపతులు యాకూబీ, చోటులకు మొదటి నుంచి సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉండేది. రాయగిరిలో సహృదయ అనాథ వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుచేసి 15 ఏళ్లుగా నిర్వహిస్తోంది. అనాథ వృద్ధాశ్రమానికి వచ్చే వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తోంది.
జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన చంద్రకళ(72) భర్త కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. ఈమెకు పిల్లలు లేకపోవడంతో ఒంటరిగా ఉంటుంది. వృద్ధాప్యంలో చంద్రకళ అలనా పాలన చూసేవారు లేకపోవడంతో ఆమె సోదరుడు గంగ ప్రసాద్ ఈ ఏడాది జనవరి 19న రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో చేర్పించాడు.
అనారోగ్యంతో ఉన్న చంద్రకళ బాగోగులను ఆశ్రమ నిర్వాహకులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రకళ మార్చి 23వ తేదీన తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని చంద్రకళ సోదరుడు గంగాప్రసాద్‌కు ఆశ్రమ నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. అయితే ఆయన రాక కోసం ముస్లిం దంపతులు రెండు రోజులపాటు వేచి చూశారు. అయితే గంగా ప్రసాద్‌ను ఆరాతీయగా అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించాడు.
దీంతో ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ, చోటు రాయిగిరి శ్మశాన వాటికలో చంద్రకళ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు చేశారు. ముస్లిం మహిళ అయినప్పటికీ దహనసంస్కారాలు చేయడంపై పలువురు ఆమెను అభినందించారు. ఇప్పటివరకు యాకూబీ, చోటు దంపతులు యాదాద్రి, వరంగల్ జిల్లాల్లో 200మంది అనాథలకు దహనసంస్కారాలు నిర్వహించారు.