ఏపీ(AP)లో అధికార వైసీపీ(YCP) నేతల ఆగడాలు రోజురోజుకు సృతిమించుతున్నాయి. ఇదివరకు రాజకీయంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులు జరిగేవి. ఇప్పుడు ఏకంగా గుళ్లోని పూజారులనూ వదలడంలేదు. తాజాగా కాకినాడ నగరంలోని ఒక శివాలయంలో భక్తుల ఎదురుగానే పురోహితులపై వైసీపీ నాయకుడు భౌతికదాడికి దిగి భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు.
ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా సోమవారం కాకినాడ(Kakinada) నగరం దేవాలయం వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అదే సమయంలో వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు. అంతరాలయంలోకి వచ్చిన ఆయన నుంచి పూజాసామగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యారు.
తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని, అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగకుండా అర్చకుడు వెంకటసత్యసాయి తోటి భక్తులతో పాటు ఆయనకూ ప్రసాదం ఇస్తుండగా చంద్రరావు కోపోద్రిక్తుడై అర్చకుడి చెంపపై కొట్టారు. అసభ్యపదజాలంతో దూషించడమే కాక మీ అంతుచూస్తానంటూ వీరంగం సృష్టించారు.
ఈ దాడిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. మంగళవారం ఆయన కుప్పం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అర్చకులను కాలితో తన్నడం,కొట్టడం హేయమైన చర్య అని అన్నారు. అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తామని, అర్చకుల కాళ్లకు మొక్కే సంప్రదాయం మనదని పేర్కొన్నారు.
వైసీపీ నేత అధికార మదానికి, సంస్కృతి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు ఇది నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా విగ్రహాలపై దాడులు జరిగాయని, ఒక్క కేసులోనూ నిందితుల పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.