రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది.. ఈ కేసు రోజుకో టర్నింగ్ పాయింట్ తో ఉత్కంఠంగా సాగుతుంది. విచారణలో సంచలన నిజాలు వెల్లడవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసు చుట్టూ అష్టదిగ్బందనం చేసిన అధికారులు ఈ అవినీతి భాగోతంలో పెద్దతలలు ఉన్నట్లు అనుమానిస్తున్నారని తెలుస్తోంది.
అదీగాక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్ రావు (Radhakishen Rao) ఇటీవల కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెల్లడించిన కీలక అంశాలపై సైతం దృష్టి సారించినట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లో, పోలీసులే స్వయంగా నగదును తరలించినట్టు రాధాకిషన్ తెలుపడంతో ఆ డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ (ED) ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేసినట్టు ప్రణీత్‌రావు (Praneeth Rao) తెలిపారు. ఈమేరకు వీటికి కావలసిన ఆర్థిక వనరులను హవాలా మార్గంలో సమకూర్చింది ఎవరనే విషయం తేలాల్సి ఉంది.. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేసే అవకాశమున్నదనే టాక్ పోలీసు వర్గాలనుంచి వినిపిస్తోంది.
అదీగాక అప్పటి అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి అడ్డదారి ఎంచుకొని.. ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టాలని భావించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ చేయడం సులువైన మార్గంగా భావించిన అధికార పార్టీ.. ప్రజలను ప్రలోభపెట్టడానికి కూడా భారీ స్థాయిలో నగదును తరలించారని దర్యాప్తులో గుర్తించారు. అదేవిధంగా రాధాకిషన్‌రావు స్టేట్మెంట్లోని అంశాలే ఈడీ దర్యాప్తుకు కీలకంగా మారనున్నదనే వాదన. వినిపిస్తుంది.
ఒకవేళ ఈడీ ఎంటరైతే బీఆర్ఎస్ (BRS)కు మద్దతు ఇచ్చిన వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలను సైతం విచారించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అక్రమ నగదు సరఫరా, హవాలా మార్గంలో తరలింపు అంశాలపై ఈడీ దర్యాప్తు చేపడితే అది ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది ప్రస్తుతం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేయటమే కాదు.. టాస్క్‌ఫోర్స్ ముసుగులో వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.
అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజుర్నగర్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్లు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు పోలీసు కస్టడీలో ఒప్పుకొని స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంది. మరోవైపు అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ ముగియడంతో వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. నేడు రాధా కిషన్ రావు కస్టడీపై నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది.
రాధా కిషన్ రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.. అదీగాక ఎస్ఐబీలో ఓస్డీగా పనిచేసిన వేణుగోపాల్ రావుకు కూడా నోటీసులు జారీ చేయగా.. ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను విచారిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు తేలితే అరెస్టు చేసే అవకాశం సైతం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది.