– లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు
– ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ
– హైదరాబాద్ లోని నివాసంలో సోదాలు
– తనిఖీల అనంతరం అదుపులోకి తీసుకున్న ఈడీ
– ఢిల్లీకి తరలించిన అధికారులు
– ధర్నాకు దగిన బీఆర్ఎస్ శ్రేణులు
– అక్రమ అరెస్ట్ అంటూ ఆగ్రహం
– న్యాయపరంగా పోరాడతానన్న కవిత
– 14 పేజీలతో అరెస్ట్ కారణాలను వివరించిన ఈడీ
ఎట్టకేలకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. 8 మంది ఈడీ అధికారుల బృందం సోదాల తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి కవితకు మెమో ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు కవితతో పాటు ఆమె భర్త అనిల్‌కు సమాచారం ఇచ్చారు.
అరెస్టుకు కారణాలను 14 పేజీల్లో వివరిస్తూ కవితకు మెమో ఇచ్చామన్న ఈడీ అధికారులు, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద ఆమె నేరానికి పాల్పడ్డారని స్పష్టం చేశారు. కవిత అరెస్ట్ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు.
పార్టీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఈడీ అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు అధికారులు. ఈ కేసులో ఈడీ అధికారులకు సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపారు కవిత. ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగిన ఎదుర్కొంటామని చెప్పారు. శ్రేణులు బలంగా మనోదైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అనిచివేతను, దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం పైన నమ్మకం ఉంచి ఎదుర్కొంటామని తెలిపారు.
ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. కవిత అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలను కోరారు.
కేటీఆర్ పై ఫిర్యాదు
కవిత అరెస్ట్ సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కేటీఆర్‌పై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు. మహిళా అధికారి భాను ప్రియా మీనా ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. కావాలనే కవితను శుక్రవారం ఈడీ అదుపులోకి తీసుకుందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని అడిగారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారని ఆరోపించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈడీ అధికారులు.
కేసులు కొత్తేం కాదు
కవిత అరెస్ట్ పై హరీశ్ రావు ఫైరయ్యారు. ఇది అప్రజాస్వామ్యమని ఖండించారు. అరెస్టులు మమ్మల్ని ఏం చేయలేవని, కవితది అక్రమ అరెస్ట్ అని అని మండిపడ్డారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కుట్రని, ఈ కుట్ర కొత్తదేం కాదని ఆరోపించారు. తమది ఉద్యమ పార్టీ అని.. కేసులకు, అరెస్టులకు భయపడమని హరీశ్ రావు స్పష్టం చేశారు. నియోజకవర్గాల కేంద్రాల్లో ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా.. ఎన్నికల ముందు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఈ కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ చర్యకు పాల్పడ్డారని హరీశ్ రావు అన్నారు.
చీప్ పాలిటిక్స్
కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదని మీడియాతో అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తేల్చి చెప్పారు. ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్ కావాలనే బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ తన పని తాను చేస్తుందని అన్నారు. కవిత అరెస్ట్ ని రాజకీయాలకు ముడిపెట్టడం బీఆర్ఎస్ దివాలాకోరు తనానికి నిదర్శనమని మండిపడ్డారు అరవింద్.
మాకేం సంబంధం..?
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ప్రశ్నించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా తప్పించుకుని తిరిగారని అన్నారు. అందుకే ఈడీ ఆమె ఇంటికి వెళ్లిందని తెలిపారు. ఇకనైనా కవిత విచారణకు సహకరించాలని సూచించారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం బీజేపీకి లేదని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని ఆయన స్పష్టం చేశారు.
నెక్ట్స్ కేజ్రీవాలేనా?
కవిత అరెస్ట్ కావడంతో తరువాత ఈడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయనుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈడీ పలుమార్లు ఆయనకు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. ఈడీ సమన్లపై స్టే విధించాలన్న ఆయన విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో కేజ్రీవాల్ ఇవాళ విచారణకు తప్పక హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈసారి ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కింద ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈడీ కేజ్రీవాల్‌కు ఎనిమిది సార్లు సమన్లు ఇచ్చింది.