మహిళల వేషాధారణపై సీనియర్ నటి అన్నపూర్ణమ్మ (Annapurnamma) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సింగర్ చిన్మయి శ్రీపాద ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. సింగర్, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి (Gachibowli) పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. భారతదేశం పట్ల ఆమె మాట్లాడిన అగౌరవమైన, అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు.
భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీగా, భారత దేశంలో పుట్టడం నా ఖర్మ అని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్నపూర్ణమ్మకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆమె గురించి మాత్రమే చెప్పాలి కానీ భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. భారత దేశంలో పుట్టడమే ఖర్మ అనడం, భారతదేశం ఒక చెత్త దేశం అని అనటం బాధాకరమని కుమార్ పేర్కొన్నారు..
ఇండియాలో ఉంటూ, ఇక్కడి సౌకర్యాలు అనుభవిస్తూ, ఈ దేశ గాలి పీల్చి, బాధ్యత గల పౌరుడిగా భారతదేశం పట్ల అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సింగర్ చిన్మయి శ్రీపాదపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మమాట్లాడారు.
అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.. ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి. రాత్రి 12 గంటల తర్వాత ఏం పని. ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయిందని ఆరోపించారు. కాగా ఈ వీడియోపై చిన్మయి ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా ఫైర్ అయ్యారు.. తనకు నచ్చిన ఒక నటి ఇలా మాట్లాడడం బాధాకరంగా అనిపించిందని వెల్లడించారు. ఆమె చెప్పినట్లుగా ఉంటే అర్ధరాత్రి హాస్పిటల్స్ లో, డాక్టర్స్ ఉండరని, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారని అన్నారు.
ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలని, అర్ధరాత్రి జరిగితే అమ్మాయిలను ఇంట్లోనే ఉంచాలని ఘాటుగా స్పందించింది. అమ్మాయిల వేషధారణ వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటివారు బతుకుతున్న ఇండియాలో ఆడపిల్లలుగా పుట్టడం మన ఖర్మ అని కటువుగా విమర్శలు చేశారు.. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారి కేసు వరకు వెళ్ళింది..