చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ పై టీడీపీ (TDP) శ్రేణులతోపాటు ఐటీ ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) లో నిరసనలకు అనుమతి లేకపోయినా ఎక్కడో ఒకచోట ధర్నా చేస్తున్నారు. తాజాగా చంద్రబాబుకు మద్దతుగా లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం చేపట్టారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేయాలని భావించారు. అయితే.. పోలీసులు వారికి షాకిచ్చారు.
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం కోసం మియాపూర్ స్టేషన్ కు పెద్దఎత్తున తరలివచ్చారు ఐటీ ఉద్యోగులు. అయితే.. ఈ నిరసన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నల్లచొక్కాలు, టీషర్టులు ధరించిన వారిని లోపలికి అనుమతించలేదు. మియాపూర్ మెట్రో స్టేషన్ కాసేపు తాత్కాలికంగా మూసివేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చారు.
ఇటు, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. నల్ల షర్ట్, టీషర్ట్ ధరించి వచ్చేవారిని స్టేషన్ లోకి రానివ్వడం లేదు. మెట్రో స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పైనా తనిఖీలు చేశారు పోలీసులు. భరత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద కొందరు ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ప్రాంతం తుళ్లూరులో రాజధాని రైతుల భారీ ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరులోని గ్రంథాలయ కూడలిలో రోడ్డుపై బైఠాయించి మహిళలు నిరసన చేపట్టారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ మౌన దీక్ష కొనసాగించారు.