అధికార ఆర్థిక బలం, అహంకారం బలుపు ఇవన్నీ మనిషిని భూమిమీద నిలబడకుండా చేస్తాయని అనుకుంటున్నారు.. ఈ మధ్యకాలంలో ప్రజా ప్రతినిధుల ఫ్యామిలీలకు చెందిన వారు చేస్తున్న రోడ్డు ప్రమాదాలను చూస్తున్న జనం.. మద్యం మత్తులో ఏం జరిగినా వాళ్ళ వాళ్ళు చూసుకుంటారులే అనే నిర్లక్ష్యంతో జరుగుతోన్న ప్రమాదాల విషయంలో అధికారులు ఇంకా డోస్ పెంచితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
అయితే ఇటీవల ప్రజాభవన్ వద్ద, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అతివేగంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సీన్ హైదరాబాద్ (Hyderabad) కేపీహెచ్బీ (KPHB) కాలనీ ఫోరమ్ మాల్ సర్కిల్లో రిపీట్ అయ్యింది. ఈ సీన్ లో ఉన్న యువకుడు కూడా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy)కి మేనల్లుడు అవుతాడని ప్రచారం జరుగుతోంది.
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణం అయిన యువకుని పేరు అగ్రజ్ అని పోలీసులు గుర్తించారు.. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో అగ్రజ్తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ప్రమాద విషయం తెలుసుకొన్న కేపీహెచ్బీ పోలీసులు.. అగ్రజ్కు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk And Drive) టెస్టు చేయగా.. మద్యం మత్తులో ఉన్నట్టు తేలిందన్నారు..
దీంతో నిందితులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వరుసగా రాజకీయ కుటుంబాలకు చెందిన వారు ఇలా ప్రజల ప్రాణాలతో చెలాగాటమాడటం జనాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి వారిపట్ల అధికారులు సైతం కఠినంగా వ్యవహరించాలని.. ప్రమాదాల నివారణకు చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది..