పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం తపిస్తున్న బీఆర్ఎస్ (BRS)ఎట్టకేలకు అభ్యర్థుల ప్రకటనలు పూర్తి చేసింది. అయితే ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు చేరువ అవ్వాలి.. వారిలో నమ్మకాన్ని కలిగించాలి.. ఇక నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో ప్రత్యర్థి బలాలు బలహీనతలపై ఒక అవగాహన కల్పించాలి.. గెలుపు కోసం అవలంభించవలసిన వ్యూహాల అమలుపై.. అలాగే గతంలో చేసిన పొరపాట్లపై సమీక్షలు జరిపి ఒక పద్దతిగా ముందుకు వెళ్ళాలి..
కానీ కేటీఆర్ (KTR) నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని తిట్టడం.. అసలు కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఎందుకు పనికిరానిదిగా చిత్రీకరించడం.. కేవలం బీఆర్ఎస్ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగినట్లుగా చూపే ప్రయత్నాలు చేయడం వల్ల సొంత పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంత జరిగినా ఇంకా గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలు ఎదురవుతున్నాయి..
కనీసం సమీక్షకు ఆహ్వానించిన వారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం ద్వితీయ శ్రేణి క్యాడర్ లో అసహనం పెరగడానికి కారణం అవుతుందని చర్చించుకొంటున్నారు.. ఎన్నికల్లో దున్నిపారేస్తామనే భ్రమలో నుంచి కేటీఆర్ భయటికి రాకుండా సమీక్షల పేరుతో పిలిచి ఇలా ప్రసంగాలు ఇచ్చి పంపించేస్తూండటంతో చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారని అనుకొంటున్నారు..
మరోవైపు నిన్న సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలపై హైదరాబాద్ (Hyderabad) తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అభ్యర్థులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. కానీ గెలుపు కోసం సమీక్ష జరిగినట్లు లేదని కేవలం.. మన పార్టీని పొగుడుకొని.. పక్క పార్టీని తిట్టడంతో సమీక్ష ముగిసిందని.. ఇలాంటి వాటి వల్ల పార్టీకి ఉపయోగం ఏంటీ అనే ప్రశ్నలు వెల్లువెత్తుటున్నారు..
అదీగాక అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న ఒకరిద్దరు నేతలు మాట్లాడటం, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌తో మాట్లాడించి, ప్రధానిపై, ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవటం, దుర్భాషలాడటం చేస్తున్నారని అనుకొంటున్నారు.. ఇలాంటివి మీడియాలో హైలెట్ కావొచ్చు కానీ.. ఎన్నికల్లో ఎలా ఉపయోగపడతాయని క్యాడర్ అయోమయానికి గురవుతున్నారని తెలుస్తోంది. ఇకనైన భ్రమలో నుంచి బయటికి వచ్చి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా ముందుకు వెళ్లకుంటే మరింత నష్టపోవలసి వస్తుందనే ప్రచారం మొదలైంది.