హైదరాబాద్(Hyderabad)లోని జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు(Jubilee Hills hit and run case)లో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో డ్రైవర్‌తో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఓ యువతి, నలుగురు యువకులు ఉన్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
కారులో అతివేగంగా వస్తూ బైక్‌ను ఢీకొట్టిన నిందితులు ఆపై ఆపకుండా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మగుడి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు ఆపకుండానే సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుడు నగరానికి చెందిన తారక్(27)గా గుర్తించారు. ఓ పబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్న తారక్ బుధవారం విధులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తారక్‌కు ఏడాదిన్నర కిందటే వివాహమైంది. అతడికి 11 నెలల బాబు ఉన్నాడు. తారక్ మృతి వార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తారక్ మృతదేహంతో బుధవారం రాత్రి పదిగంటల వరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. కారు నడిపిన నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తారక్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.