రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)పై బీజేపీ లీడర్, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్(Etala Rajender) స్పందించారు. ఆదివారం ఈటల మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలి బాధితుడిని నేనే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషులు ఇలా ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా కేసీఆర్ పన్నాగమే అని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నానని ఈటల అన్నారు. కేసీఆర్ తన కేబినెట్‌లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని.. వాళ్ల ఫోన్లు, భార్యభర్తల సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ వలన కొందరి కాపురాలు కూడా కూలిపోయాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధకరమైన విషయం అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు.
బీఆర్ ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలు కాదని ఓడిన వారితో ప్రారంభోత్సవాలు చేయించిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుందన్నారు.కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని వాపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్ పాలనను ఫాలో అవతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి.. ఫ్యామిలీకి మల్కాజిగిరి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని ఈటల జోస్యం చెప్పారు.