మాజీ సీఎం కేసీఆర్‌కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒకప్పుడు అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్(KCR)..ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ‘నువ్వు వద్దు.. నీ పార్టీ వద్దు’ అంటూ నేరుగా మొహం మీద చెప్పేస్తున్నారు. దీంతో ఏం చేయాలో పాలు పోక కేసీఆర్ ఫాంహోస్‌లోనే ఉండిపోయారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎంపీ అభ్యర్థుల కోసం ఆయన ప్రచారం చేయడానికి బయటకు వస్తారనుకుంటే సొంత పార్టీ నేతలు ఇచ్చే షాకులకు ఆయన ఇప్పట్లో బయటకు(Out Of The Party) వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు ఆయన గారాల పట్టి ఎమ్మెల్సీ కవిత(Kavitha) లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు.
కేటీఆర్(KTR), హరీశ్ రావు(HarishRao) కవితను విడిపించడానికి ఢిల్లీ టు హైదరాబాద్ జర్నీలు చేస్తున్నారు. దీంతో పార్టీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఎంపీ ఎన్నికల్లో పోటీకి సీనియర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా.. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేకే, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహా మరింత మంది కీలక నేతలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
గతంలో వీరంతా ఇతర పార్టీల నుంచి కేసీఆర్ పార్టీలో చేరి ఆయన ఆశీస్సుల కోసం వెంపర్లాడిన వారే కావడం గమనార్హం. అధికారం దూరమై 3 నెలలు కాకముందే వెంటనే అధికారపార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.వీరంతా పదేళ్లు బీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులు అనుభవించిన వారే.
పార్టీలో తగిన ప్రాధాన్యత ఇచ్చినా ఎందుకు వెళ్తున్నారని కేసీఆర్ ప్రశ్నిస్తే.. కూతురి భవిష్యత్ కోసం, బీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ లేదని మరికొందరు కేసీఆర్‌కు కారణాలు చెప్పారని తెలిసింది. కేసీఆర్ మౌనమే వీరికి ఇంత ధైర్యం ఇచ్చిందని, అపర చాణక్యుడితో పరిహాసాలు ఆడుతున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు.