భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ( Bharat Ratna)తనకు దక్కడంపై బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (LK Advani) స్పందించారు. భారతరత్న అందుకోవడం ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని అన్నారు. ఈ అవార్డును తన సిద్దాంతాలకు ఆదర్శాలకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించారు.
తనకు భారత రత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోడీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన జీవితం దేశం కోసమేనని ఎప్పుడో నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఎంతో వినయంగా, కృతజ్ఞతతో ఈ భారతరత్న పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పారు.
తన వ్యక్తిగత, రాజకీయ జీవితంలో తన భార్య కమల తన వెన్నంటే ఉంటూ ఎంతో మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులు తనకు అన్ని విధాలుగా అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లే తన బలమన్నారు. 14 ఏండ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్లో చేరానని తెలిపారు.
తాను ఏం చేసినా అది దేశం కోసమేనని ఆ నాడే నిర్ణయించుకున్నానని వివరించారు. ఈ జీవితం తర కోసం కాదు.. దేశం కోసం అనే సిద్దాంతాన్ని తాను నమ్మానన్నారు. దేశం కోసం ఏం చేసినా దాన్ని పూర్తి అంకితభావంతో, నిస్వార్థంగా చేశానని పేర్కొన్నారు. ఈ రోజు పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయీని మనసారా స్మరించుకుంటున్నానన్నారు.