శ్రీ రాముడు ‘మాంసాహారి’ అంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై (Controversial Comments) ఎన్సీపీ నేత జిత్రేంద్ర అవద్ (Jitendra Awhad) క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలపై ఆయన విచారం (Regret) వ్యక్తం చేశారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని తెలిపారు. తన వ్యాఖ్యలు కొంత మంది మనోభావాలను దెబ్బ తీసిందని తెలిసి తాను బాధపడుతున్నట్టు చెప్పారు. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్నారు.
చరిత్రను వక్రీకరించడం తన పని కాదని చెప్పారు. తాను అధ్యయనం చేయకుండా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఆ వ్యాఖ్యలు తన సొంత వ్యాఖ్యలు కాదని పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలోనే రాసి ఉందని వివరించారు. 1891 నాటి అధికారిక ప్రతిని కోల్‌కతా ఐఐటీ కాన్పూర్‌లో ప్రింట్ చేశారని అన్నారు. ఈ విషయంలో చాలా అధ్యయనాలు జరిగాయన్నారు.
ఈ రోజుల్లో చదువు కన్నా భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. అందుకే తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. తనపై దాఖలైన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తాను ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌కు భయపడబోనని స్పష్టం చేశారు. ఇది ఇలా వుంటే జితేంద్ర అవద్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, సాదువులు మండిపడ్డారు.
అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వ్యాఖ్యలు అవమానకరమని అన్నారు. ఎంపీ వ్యాఖ్యలు రామ భక్తుల మనోభావాలను ఎంపీ దెబ్బ తీశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
ఇలాంటి వ్యాఖ్యలను ఇతర మతాలపై ఎంపీ చేసి ఉంటే ఇప్పటికే ఎంపీ మరణించి ఉండేవాడన్నారు. మర్యాద పురుషోత్తుముడైన శ్రీ రామున్ని అవమానిస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. హిందు మత గ్రంధాల గురించి తెలియకుంటే మొదట ఎంపీ ఆ గ్రంధాల గురించి జ్ఞానం పెంచుకోవాలన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర, కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ రాముని గురించి తప్పుగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జితేంద్ర అవద్‌పై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆయన్ని చంపేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు ఎంపీ వ్యాఖ్యలపై రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్సీపీ నేతలు వ్యాఖ్యలు అసత్యమని స్పష్టం చేశారు.
శ్రీ రాముడు వనవాసానికి వెళ్లిన సమయంలో మాంసాహారం భుజించారని ఏ గ్రంథంలోనూ రాయలేదన్నారు. వనవాస సమయంలో శ్రీ రాముడు కేవలం దుంపలు, పండ్లు తిన్నట్లుగా ప్రతిచోటా రాసి ఉందని చెప్పారు. అందుకు శాస్త్రాలే సాక్ష్యమన్నారు. అంతకు ముందు ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్డీలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….
శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని అన్నారు. 14 ఏండ్లు అడవిలో నివసించే వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాయి. ఈ క్రమంలో ఎన్సీపీ నేత వెనక్కి తగ్గారు. తాను పలు గ్రంథాలను అధ్యయనం చేసిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. కానీ ఈ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరారు.