టీమిండియా (Team India) దిగ్గజ మాజీ స్పిన్నర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ (Harbajan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానని స్పష్టం చేశారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌పై హర్బజన్ సింగ్ నిప్పులు చెరిగారు. రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అది వేరే విషయమని చెప్పారు.
ఇక్కడ సరైన విషయం ఏంటంటే రామ మందిరాన్ని ప్రారంభించడమన్నారు. ఈ కార్యక్రమానికి ఏ పార్టీ వెళ్తుంది, ఏ పార్టీ వెళదనేది సమస్య కాదన్నారు. తాను రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరవుతానని చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా సమస్య ఉంటే వాళ్లు ఏం కావాల్సిస్తే అది చేసుకోవచ్చన్నారు.
‘దేశ ప్రజలకు నా శుభాకాంక్షలు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వీలైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని రాముల వారి ఆశీస్సులు పొందాలి. ఇది చారిత్రాత్మకమైన రోజు. రాముడు అందరికీ చెందినవాడు. ఆయన జన్మస్థలంలో రాముడి గుడి నిర్మాణం జరగడం చాలా పెద్ద విషయం. అందరూ వెళ్ళాలి’అని అన్నారు.