క్రికెట్ వరల్డ్ కప్(Cricket world cup 2023 ) ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్ అభిమానులు వరల్డ్ కప్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 5న భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వివిధ దేశాల ఆటగాళ్లు గెలుపే లక్ష్యంగా ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు.
నిన్నటి దాకా భారత్ తమ జట్టును పంపేదే లేదని ఫోజులు కొట్టిన దాయాదిదేశం పాకిస్థాన్( Pakistan) మేము సైతం అంటోంది. తాజాగా ఆస్ట్రేలియా(Australia) 18 మంది ఆటగాళ్లతో ప్రిలిమినరీ స్క్వాడ్(Preliminary Squad)ను ప్రకటించింది. మిగతా జట్లు సైతం ప్రపంచ కప్ కోసం వ్యూహాలు రచిస్తున్నాయ్.
ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరల్డ్ కప్‌తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ శర్మ ఇలాగే నవంబర్ 19న కూడా ప్రపంచ కప్‌ను ఎత్తుకొని ముద్దాడాలని అభిమానులు అభిలషిస్తున్నారు. అదే జరిగితే భారత్ ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచినట్లు అవుతుంది.
అయితే సెంటిమెంట్ ప్రకారం కూడా ఈసారి టీమిండియానే వరల్డ్ కప్ గెలుస్తుందని కొందరు చెబుతున్నారు. 2011లో భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగ్గా..ఆ ఏడాది టీమిండియానే కప్పు గెలిచింది.
2015లో ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 2019లో వరల్డ్ కప్ ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్ కప్పును తన్నుకుపోయింది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈ ఏడాది వరల్డ్ కప్‌ను కూడా భారత్ గెలుస్తుందని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవడం ఖాయం. ఆస్ట్రాలజర్స్ కూడా ఈసారి టీమిండియానే వరల్డ్ కప్ కొడుతుందంటున్నారు. గురు, అంగారక గ్రహాలు భారత జట్టుకు అనుకూలంగా ఉన్నాయంటున్నారు. ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ బ్రహ్మచారి కూడా ఈసారి భారత్ వరల్డ్ కప్ గెలవడం ఖాయమని జోస్యం చెబుతున్నారు.
కానీ టీ20 వరల్డ్ కప్ సెంటిమెంట్ మాత్రం మరోలా ఉంది. షార్ట్ ఫార్మాట్లో ప్రపంచ కప్ ఆతిథ్యం ఇచ్చిన జట్లేవీ ట్రోఫీ గెలిచిన పాపానపోలేదు. 2016లో టీ20 వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వగా..ఆ ఏడాది భారత్ సెమీస్‌లో చతికిలపడింది. కప్పు కరేబియన్స్ ఎగరేసుకుపోయారు.
ఈసారి భారత్ వరల్డ్ కప్ గెలవాలంటే..ఆస్ట్రేలియా తరహాలోనే కొన్ని సాహాసోపేత నిర్ణయాలు తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. లేకపోతే వరల్డ్ కప్ గెలవడం అంత సులభమైన విషయం కాదంటున్నారు కొందరు విశ్లేషకులు.