కేంద్రంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెబుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం(Chidambaram) కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హస్తం పార్టీ మేనిఫెస్టోపై ఫోకస్ చేసింది.
గురువారం రాత్రి మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇప్పటికే బహిర్గతం కాగా, రాజస్థాన్‌లో నిర్వహించే జైపూర్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్బంగా పి. చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలోని కీలక అంశాలను ప్రస్తావించారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేస్తామని కూడా చెప్పారు. భారతీయ రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేస్తామని, అగ్నివీర్ స్కీం రద్దు చేస్తామని ప్రకటించారు. అదే విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తామని ప్రకటించారు.
సంపద సృష్టించాలంటే వృద్ది రేటు పెరగాలన్నారు. మోడీ పాలనలో అలా జరగలేదని పేర్కొన్నారు. ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదని, యూపీఏ హయాంలో వృద్ధి రేటు 7.8గా ఉంటే.. ఎన్డీయే హయాంలో గత పదేళ్లలో 5.8గానే ఉందని చిదంబరం చెప్పుకొచ్చారు.